కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం ఇల్లు, కార్యాలయాల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగై సహా దేశ వ్యాప్తంగా ఏడు చోట్ల సి.బి.ఐ సోదాలు జరుగుతున్నాయి. తనయుడు కార్తీ చిదంబరం పై నమోదైన కేసులకు సంబంధించిన వ్యవహారంలో భాగంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. 2010 నుంచి 2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు నగదు తరలించారని ఆరోపణలు ఉన్నాయి.
కార్తీ చిదంబరం తన తండ్రి పి.చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రూ .305 కోట్ల మేరకు విదేశీ నిధులను స్వీకరించినందుకు ఐఎన్ఎక్స్ మీడియా కు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(FIPB) క్లియరెన్స్ కు సంబంధించిన కేసు తో సహా అనేక కేసుల్లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో మరోసారి సీబీఐ సోదాలు ఆసక్తికరంగా మారాయి.