నోటిలో బెలూన్ పేలిపోవడం వల్ల ఎనిమిదేళ్ల బాలిక మరణించిన దుర్ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బెలూన్ కు గాలిన ఊదుతుండగా అది అకస్మాత్తుగా పేలిపోయింది. అయితే బెలూన్ లోని ఓ ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కోవడం వల్ల ఊపిరాడక ఆ బాలిక మృతిచెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు షాక్ అయ్యారు. తమ కుమార్తె మరణించడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మహారాష్ట్ర ధూలే నగరంలో యశ్వంత్ నగర్లోని సక్రి రోడ్ సమీపంలో డింపుల్ మనోహర్ వాంఖడే అనే బాలిక తోటి స్నేహితులతో కలిసి బెలూన్లతో ఆడుకుంటోంది. ఈ క్రమంలో బెలూనుకు గాలి ఊదుదామని ప్రయత్నించగా అది అకస్మాత్తుగా పేలింది. అంతే బెలూనులోకి ఓ ముక్క ఆమె గొంతులో ఇరుక్కుపోయి ఆ చిన్నారి స్పృహతప్పి పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు తెలిపారు. సరదాగా బెలూన్లతో ఆడుకుంటున్న తమ కుమార్తె ఇలా ప్రాణాలు విడవడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.