డేరా సచ్చా సౌదా ఆశ్రమ అధిపతి గుర్మీత్ రాం రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 12 సార్లు ఆయన పెరోల్ పై కారాగారం నుంచి బయటకు వచ్చి వెళ్లాడు. అయితే బుధవారం మరోసారి ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం రోహ్తక్లోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌కు 21 రోజుల పాటు పెరోల్ లభించింది. దీంతో ఆయన కారాగారం నుంచి బయటకు రావడం ఇది 13వ సారి.
చట్టపరమైన మార్గాల్లోనే ఈ పెరోల్ లభించిదని డేరా బాబా తరఫు న్యాయవాది జితేంద్ర ఖురానా తెలిపారు. ఇందులో అసాధారణమైనది ఏమీ లేదని.. ఒక ఖైదీకి సంవత్సరంలో 70రోజుల వరకు పెరోల్ లభిస్తుందని చెప్పారు. రహీమ్‌కు పెరోల్ మంజూరు చేయడం పూర్తిగా చట్టపరమైన హక్కు అని వెల్లడించిన లాయర్ జితేంద్ర.. ఎన్నికలకు ముందు 30రోజుల పాటు పెరోల్ లభించినప్పుడు పదే పదే విమర్శలు చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పడు ఎన్నికలు, ఎలాంటి రాజకీయ ఉద్యమాలు లేవని.. పెరోల్‌కు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.