డబ్బులు ఎక్కువగా వచ్చే ఉద్యోగం అంటే అందరూ మొదట చెప్పేది సాఫ్ట్‌వేర్ జాబ్. పేరులోనే సాఫ్ట్ ఉంది కానీ.. వీరి వర్క్, లైఫ్ మొత్తం హార్డ్‌గానే ఉంటుందని బయట టాక్. అదే నిజమనుకోండి. జీతం కోసం జీవితమా, జీవితం కోసం జీతమా అనే కన్ఫూజన్‌లో వీళ్లు బతికేస్తుంటారు. వీళ్ల గడియారంలో గంటల ముల్లు సెకన్లలా ఫాస్ట్‌గా తిరుగుతుంది. ఎందుకంటే.. అన్నన్ని గంటలు ఆ సిస్టమ్ ముందు కుర్చోని కష్టపడుతుంటారు. టెన్షన్ అయితే ఎప్పూడు వెన్నంటే ఉంటుంది. ఒక్క జీతం ఎక్కువ అనే పాజిటివ్ తప్ప వేరే ఏ పాజిటివిటీ లేని ఉద్యోగం అంటే సాఫ్ట్‌వేర్.. ఇది మేం చెప్పడం లేదండోయ్.. సర్వేలు చెబుతున్నాయి.. సాఫ్ట్‌వేర్ జాబ్ ఉన్నవాళ్లకు పిల్లను ఇచ్చేప్పుడు వారి జీతం బాగుంది కదా అని కమిట్ అయిపోకండి.. ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని గణాంకాలు గట్టిగా చెబుతున్నాయి..
ఐటీ ఉద్యోగులు గంటలకొద్దీ కూర్చొని పనిచేయడం ద్వారా పలు రోగాలను కొనితెచ్చుకుంటున్నారని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) హెచ్చరించింది.
46 శాతం మంది జీవనశైలి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని, 78 శాతం మంది వ్యాయామానికి దూరం అయ్యారని ఎన్‌ఐఎన్ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్ నగర కేంద్రంగా ప్రముఖ ఐటీ సంస్థల్లో పని చేస్తున్న 183 మంది ఐటీ ఉద్యోగులపై అధ్యయనం చేయగా ఆ వివరాలు అంతర్జాతీయ పీర్ రివ్యూడ్ జర్నల్ ‘న్యూట్రియంట్స్’ ఆగస్టు 2023 సంచికలో ప్రచురించారు. ఈ అధ్యయనం 46 శాతం మంది జీవనశైలి వ్యాధులబారిన పడే ప్రమాదంలో ఉన్నారని తేల్చి చెప్పింది. ప్రతి 10 మందిలో ముగ్గురు రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులబారిన పడుతున్నారని పేర్కొంది.
మగవారిలో నడుము చుట్టుకొలత 90 సెంటీమీటర్లు(సుమారు 36 అంగుళాలు), ఆడవారిలో 80 సెంటీమీటర్ల(సుమారు 32 అంగుళాలు) చుట్టుకొలత కంటే ఎక్కువ ఉంటే.. జీవనశైలి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఎన్‌ఐఎన్ చెప్పింది.
మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, తగిన విశ్రాంతి పద్ధతులను అలవర్చడానికి ప్రతి ఐటీ సంస్థలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉందని ఎన్‌ఐఎన్ తెలిపింది. తరచూ ఆరోగ్య పరీక్షలు చేసి.. తదనుగుణంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చవచ్చని పేర్కొంది.
78 శాతం మంది వ్యాయామం, శారీరక శ్రమకు దూరంగా ఉన్నారని, కేవలం 22 శాతం మంది ఉద్యోగులు మాత్రమే వారంలో నిర్దేశించిన 150 నిమిషాల పాటు శారీరక శ్రమ(వ్యాయామం) చేస్తున్నారని పేర్కొంది.
26 నుంచి 35 ఏళ్ల లోపు వయసు వారు కూడా ఊబకాయం, రక్తపోటు, మధుమేహం బారినపడే ప్రమాదంలో ఉన్నారని సర్వే హెచ్చరించింది.
తరచూ బయట తినడం, రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం, భోజనంలో సమయపాలన పాటించకపోవడం, లేదంటే భోజనం మానేయడం వంటి అలవాట్లు ఐటీ ఉద్యోగులను దీర్ఘకాలిక వ్యాధులబారిన పడేట్టు చేస్తున్నాయట. 30 సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న సీనియర్ ఉద్యోగుల్లో ఒత్తిడి అధికంగా ఉందని.. వారిలో జీవనశైలి ప్రమాద కారకాలు ఎక్కువగా కనిపించాయని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు అంటున్నారు. ఏది ఏమైనా.. ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే ఎంత సంపాదించినా దండగే. కాబట్టి మీకోసం మీరు కాస్త టైమ్‌ను కేటాయించుకోని వ్యాయామం చేయండి. బయట ఆహారాలను తినడం తగ్గించండి. వీకెండ్ వస్తే బిర్యానీల కోసం ఎగబడకండి.! లైఫ్ అంటే శని, ఆదివారం మాత్రమే కాదు అని నిజాన్ని గుర్తెరిగి అందుకు తగిన విధంగా ప్లాన్ చేసుకోండి.