భారీ వర్షాలు తమిళనాడును ముంచేస్తున్నాయి. చలికాలంలో వానలు కురుస్తుండటంతో తమిళ ప్రజలు వణికిపోతున్నారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వానలకు రాష్ట్రంలో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు కాలు బయటపెట్టాలంటే వణుకుతున్నారు.
మరోవైపు.. నీలగిరి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వృక్షాలు రోడ్లపై కూలడంతో.. రహదారిపై అడ్డంగా పడిన కొండచరియలను, వృక్షాలను.. క్రేన్ల సాయంతో తొలగించే పనిలో సిబ్బంది బిజీగా ఉన్నారు. అనేక ఇళ్లలోకి చేరిన వరద నీరు చేరింది. రహదారులపై వరద పొంగిపొర్లుతోంది. చెన్నైలో కురిసిన భారీ వర్షానికి రైల్వే సబ్‌వేలో భారీగా వరదనీరు చేరడంతో ఒక బస్సు నీటిలో నిలిచిపోయింది. మరో వాహనం సహాయంతో ట్రాఫిక్ సిబ్బంది ఆ బస్సును బయటకి తీశారు. మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో ప్రజలు.. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.