దేశ వ్యాప్తంగా మావోయిస్టులు లేకుండా చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే మావోయిస్టులు మాత్రం రోజు రోజుకు రెచ్చిపోతున్నారనే చెప్పాలి. ప్రధానంగా ఛతీస్ గఢ్ లోని నారాయణ్ పూర్ లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేల్చడంతో ఇద్దరూ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్లు అమరులయ్యారు.
మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ ఉదయం స్థానిక దుర్భేద ప్రాంతంలో కూంబింగ్ కోసం ఐటీబీపీ, జిల్లా రిజర్వ్ గార్డు బలగాలు వెళ్తున్న సమయంలో కొడ్లియార్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరమరణం పొందిన వారిలో ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన కే.రాజేష్ అనే జవాన్ ఉండటం గమనార్హం. మరోవైపు ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అరెస్ట్ అయిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే సుజాత అరెస్ట్ ను మావోయిస్టు పార్టీ ఖండించినట్టు ఓ ప్రకటన విడుదల చేసింది.