కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం, హత్య జరిగిన తర్వాత జూనియర్ డాక్టర్లు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసన తెలుపుతున్న వైద్యులను కలిసేందుకు శనివారం కోల్కతాలోని స్వాస్థ్య భవన్ కి చేరుకున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
ఈ సందర్భంగా “మాకు న్యాయం కావాలి” అనే నినాదాల మధ్య నిరసన తెలుపుతున్న వైద్యులను ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నం అని తెలిపారు. భద్రతా సిబ్బంది వద్దని చెప్పినప్పటికీ మీ ఆందోళనలకు సెల్యూట్ చేసేందుకే తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. తాను ఇక్కడికి ఓ ముఖ్యమంత్రిగా రాలేదని.. మీ సోదరిగానే వచ్చానని అన్నారు మమతా బెనర్జీ.
వైద్యులు ఎండ, వానల్లో రోడ్లపై ఆందోళన చేస్తుంటే.. తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని అన్నారు. మీ డిమాండ్లను కచ్చితంగా అధ్యయనం చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు మమతా బెనర్జీ. తనపై నమ్మకం ఉంటే చర్చలకు వచ్చి వెంటనే విధుల్లో చేరాలని అన్నారు. అయితే తమ డిమాండ్లపై చర్చ జరిగే వరకు రాజీకి వచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చి చెప్పడంతో సీఎం అక్కడి నుండి వెళ్లిపోయారు.