ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారిణి నిధి తివారీ నియామకమయ్యారు. కేంద్ర కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమె నియామకానికి ఆమోదం తెలిపినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) అధికారికంగా ప్రకటించింది. నిధి తివారీ వారణాసిలోని మెహముర్‌గంజ్‌కు చెందినవారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంక్ సాధించిన ఆమె.. గతంలో వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్(వాణిజ్య పన్నులు)గా విధులు నిర్వహించారు.
2023 జనవరి 6 నుంచి పీఎం డిప్యూటీ సెక్రటరీగా పని చేసిన ఆమె.. 2022లో అండర్ సెక్రటరీగా చేరారు. పీఎంవోలో చేరడానికి ముందు విదేశాంగ మంత్రిత్వశాఖలో పని చేసిన నిధి తివారీకి.. అంతర్జాతీయ సంబంధాల మెరుగుదలలో ఉన్న నైపుణ్యమే పీఎంవోలో ఆమెను కీలకపాత్ర పోషించే స్థాయికి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె డిప్యూటీ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే నిధి.. కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన ఆదేశాలు త్వరలో వెల్లడించనున్నట్లు డీవోపీటీ ఒక ప్రకటనలో తాజాగా పేర్కొంది.