2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చింది. అబ్ కీ బార్… చార్ సౌ పార్ అని నినదించిన బీజేపీని సొంతంగా మెజార్టీ తెచ్చుకోలేని పరిస్థితికి తెచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమిలోని పలు పార్టీల మద్దతు కోరే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఈ నేథ్యంలో ఎన్డీఏ కూటమిలో భాగమైన జేడీయూ అధినేత నీతీశ్ కుమార్‌కు ఇండియా కూటమి డిప్యూటీ ప్రధాని పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయవర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
అయితే దీనిపై ఇప్పటి వరకు ‘ఇండియా’ కూటమి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా జేడీయూ నిలిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ జేడీయూ కీలకంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో నీతీశ్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు ‘ఇండియా’ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. బిహార్ డిప్యూటీ సీం సమ్రాట్ చౌదరి, నీతీశ్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు.