ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య అగ్గిరాజుకుంటోంది. ఈ వ్యవహారంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉన్నందున భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్లు సమాచారం.
నిర్వహణ కారణాలతో కెనడాలో వీసా సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు ఈ రద్దు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, కెనడియన్ల వీసా దరఖాస్తులను ప్రాథమికంగా పరిశీలించేందుకు ఏర్పాటైన ఓ ప్రైవేటు ఏజెన్సీ మాత్రం తమ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ‘‘నిర్వహణ కారణాలతో సెప్టెంబరు 21 నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు భారత వీసా సర్వీసులు రద్దు’’ అని ఆ ఏజెన్సీ వెల్లడించింది.