ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలయ్యాయి. భారత్తో వివాదం మాల్దీవుల పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అధికారిక లెక్కల్లో స్పష్టంగా తెలుస్తోంది. భారత్ నుంచి మాల్దీవుల పర్యటనకు వెళ్లే వారి సంఖ్య మూడు వారాల వ్యవధిలో 8 శాతానికి తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గతేడాది మాల్దీవులకు విదేశీ పర్యటకుల రాకలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయింది. భారత సెలెబ్రెటీలు, ప్రముఖులు, సామాన్యుల నుంచి ఎదురైన వ్యతిరేకతే ఇందుకు కారణమైంది. భారత్తో వివాదం వల్ల మాల్దీవుల పర్యటకంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాల్దీవుల పర్యటక శాఖ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం గతేడాది డిసెంబర్ 31 నాటికి 2,09,198 మంది పర్యటకులతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అప్పుడు మాల్దీవుల్లో భారత సంద్శకుల వాటా దాదాపు 11 శాతంగా ఉండగా.. వివాదం తర్వాత ఈనెల 28 వరకు మాల్దీవుల టూరిజంలో భారత్ వాటా 8 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 13,989 మంది భారతీయులు మాత్రమే మాల్దీవుల్లో పర్యటించారు.