పూరీ జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించారు: ఇస్కాన్‌

-

 అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆయన స్వల్ప గాయంతో బయటపడ్డారు. అయితే ఆయన ప్రాణాలతో బయటపడటానికి పూరీ జగన్నాథుడి కృపే కారణమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వ్యాఖ్యానించింది. రథయాత్రతో ట్రంప్‌నకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసింది.

‘‘ఇది కచ్చితంగా జగన్నాథుడి కృపే. 48 ఏళ్ల క్రితం రథయాత్రకు ట్రంప్‌ సహకారం అందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రథయాత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆ భగవంతుడి అనుగ్రహమే ఆయన్ను రక్షించింది’’ అని ఇస్కాన్‌ ప్రతినిధి రాధారమణ్ దాస్ వ్యాఖ్యానించారు. 1976లో ఇస్కాన్‌ భక్తులు రథయాత్ర కోసం రథాలు సిద్ధం చేసుకునేందుకు ఉచితంగా తన ట్రైన్‌ యార్డ్‌ను ఇచ్చి ట్రంప్ సహకరించినట్లు ఆయన తెలిపారు.

ఇదీ జరిగింది.. పెన్సిల్వేనియాలోని బట్లర్‌ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ మాట్లాడుతుండగా ఓ యువకుడు కాల్పులు జరపడంతో ఆయన చెవికి తీవ్ర గాయమైంది. ఈ ఘటన జరిగిన సమయంలో సభలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లలో కొందరు ఆయన్ను అక్కడినుంచి సురక్షిత ప్రదేశానికి తరలించగా, అదే సమయంలో మరికొందరు దుండగుడిపై కాల్పులు జరిపి హతమార్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version