ఎన్నికలకు ముందు వైసీపీ ఓ ప్రయోగం చేసింది.. స్వంత నియోజకవర్గాలు కాదని.. కొందరిని కొత్త నియోజకవర్గాలకు పంపారు వైసీపీ అధినేత జగన్.. ఆ ప్లాన్ బెడిసి కొట్టి.. ఘోరంగా ఓడిపోయారు ఆ నేతలు.. ఇప్పుడు భవిష్యత్ ఏంటనే డైలమాలో వారందరూ ఉన్నారు.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓటమిపాలైన నేతలందరి పొలిటికల్ ప్యూచర్ డేంజర్ లో పడిందనే ప్రచారం నడుస్తోంది..ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే.. ఒంగోలు మినహా.. 11 నియోజకవర్గాల్లో మార్పులు జరిగాయి.. జగన్ ఆదేశాలతో వారందరూ కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేశారు.. మళ్లీ గెలుస్తామని భావించినా.. క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్ అవ్వడంతో వారందరూ ఓటమి పాలయ్యారు.. దీంతో ఓడిపోయిన అభ్యర్దులకు కొత్త తలనొప్పి మొదలైందట..
సిట్టింగ్ స్థానం వదులుకుని.. అధినేత ఆదేశాలతో కొత్త నియోజకవర్గంలో పోటీ చేసిన నేతలు అంతర్మథనంలో పడ్దారని టాక్ వినిపిస్తోంది.. కొత్త నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తులను బుజ్జగించి.. ప్రజల్లోకి వెళ్లే లోపు ఎన్నికలు వచ్చాయని.. అందుకేతాము ఓడిపోయామని.. కొందరు మాజీలు అనుచరులు వద్ద వాపోతున్నారట.. కొత్త నియోజకవర్గాల్లో పోటీ చెయ్యడం వల్లే ఓడిపోయామని పీల్ అవుతున్నారని ప్రచారం నడుస్తోంది..
ఓటమి వ్యవహారం పక్కనపెడితే.. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పార్టీని నడపడం వారికి కష్టతరంగా మారిందట.. ఒంగోలు నుంచి పోటీ చేసిన బాలినేని తప్ప.. మిగిలిన ఎమ్మెల్యేందరూ స్వంత నియోజకవర్గాలు పక్కనపెట్టి.. వేరే నియోజకవర్గాల్లో పోటీ చేశారు.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం, దర్శి తప్ప పది నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయింది.. మాజీ మంత్రి సురేష్ స్వంత నియోజకవర్గం యర్రగొండపాలెం వదలి..
కొండెపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. వేమూరు నుంచి వచ్చిన మాజీ మంత్రి నాగార్జున సంతనూతలపాడులో పోటీ చేశారు.. మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో కూడా చివరి నిమిషంలో అభ్యర్దులను మార్చేసింది వైసీపీ.. కనిగిరి నుంచి కందుకూరులో పోటీ చేసి మధుసూధన్ కూడా ఓటమి పాలయ్యారు.. ఇప్పుడు ఓడిపోయిన నేతలందరూ తమ స్వంత నియోజకవర్గాల్లో రాజకీయాలు చేసే ఆలోచనలో ఉన్నారట.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో స్వంత నియోజకవర్గాల్లో ఉంటేనే బెటరని భావిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు..
దీనిపై అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో అర్దంగాక వారు తలలు పట్టుకుంటున్నారని ఉమ్మడి ప్రకాశంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది..