మన స్పేస్ టెక్నాలజీని అమెరికా అడిగింది : ఇస్రో ఛైర్మన్ సోమనాథ్

-

చంద్రయాన్‌-3తో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). చంద్రుడి దక్షిణ ధ్రుంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన భారత్​ను ప్రపంచ దేశాలు ​వేనోళ్ల పొగిడాయి. ఈ నేపథ్యంలోనే చంద్రయాన్ వ్యోమనౌక అభివృద్ధి కార్యకలాపాలను అమెరికా అంతరిక్ష నిపుణులు పరిశీలించారు. అయితే పరిశీలించిన అనంతరం సంబంధిత టెక్నాలజీని తమతో పంచుకోవాలని అమెరికా కోరినట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు.

స్పేస్​లో ఇప్పుడంతా భారత్ హవా కొనసాగుతోందని సోమనాథ్ అన్నారు. ఇప్పుడు భారత్‌ అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగలదని.. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచారని చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆదివారం రోజున సోమనాథ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

భారత్ చాలా శక్తిమంతమైన దేశమని.. ఇక్కడి విజ్ఞానం, మేధస్సు ప్రపంచంలో అత్యుత్తమమని సోమనాథ్ ఉద్ఘాటించారు. చంద్రుడిపై ల్యాండింగ్‌కు ఉద్దేశించిన చంద్రయాన్‌-3’ వ్యోమనౌకను రూపొందించిన అనంతరం నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ (జేపీఎల్‌) నిపుణులను ఆహ్వానించామని తెలిపారు. వారికి చంద్రయాన్‌-3 గురించి వివరించి.. దీని రూపకల్పనకు ఇంజినీర్లు ఏ విధంగా కష్టపడ్డారు? చంద్రుడిపై ఏ విధంగా ల్యాండ్‌ చేయనున్నాం? తదితర విషయాలు చెప్పామని.. అప్పుడు వారు అంతా సాఫీగా  జరుగుతుందంటూ సమాధానమిచ్చారని వెల్లడించారు. ఇస్రో.. శాస్త్రీయ పరికరాలను పరిశీలించి.. అవి చాలా తక్కువ ఖర్చుతో, నిర్మాణానికి సులభంగా, అత్యాధునిక సాంకేతికతతో ఉన్నాయని.. వాటిని తమతో పంచుకోవాలని నాసా నిపుణులు కోరారని సోమనాథ్ గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version