గత నెల 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవ్వగా.. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40వేల మంది ఉన్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఐఐటీ మద్రాస్ ఈ ఫలితాలను విడుదల చేయనుంది.
ఈసారి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యాసంస్థలు 114 నుంచి 121కి పెరిగాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్త కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియ ఈనెల 10 నుంచి జులై 23వ తేదీ వరకు 44 రోజులపాటు కొనసాగుతుంది. గత విద్యా సంవత్సరం(2023-24)లో 23 ఐఐటీల్లో 17,385 సీట్లున్నాయి. ఈసారి మరిన్ని పెరగవచ్చని తెలుస్తోంది.