భారత్లో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. కేరళలో కొత్త సబ్ వేరియంట్ వెలుగు చూసిన దృష్ట్యా రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది.కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. రానున్న పండగల సీజన్‌లో వైరస్ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని సూచించింది.
ఇన్‌ఫ్లుయెంజా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వైరస్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు ఇటీవల కేరళలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. భారత్ సహా 38 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. అప్రమత్తంగా ఉంటూ, కొత్త కేసులపై నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.