మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భూములు కబ్జా చేశారంటూ కొందరు ఇచ్చిన ఫిర్యాదుతో ఇటీవల మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన మల్లారెడ్డి అవన్నీ అవాస్తవాలేనని.. తనకు భూములు కబ్జా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం తననేమి ఇబ్బంది పెట్టడం లేదని స్పష్టం చేశారు.
అయితే తాజాగా తనపై నమోదైన కేసులపై మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మల్లారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ కె.సురేందర్ ముందుకు విచారణకు రాగా ప్రజాప్రతినిధుల కేసును విచారించే బెంచ్ ముందు ఈ పిటిషన్‌ను ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. మేడ్చల్ మండలం మూడు చింతపల్లి మండలం కేశవాపురం గ్రామంలో మాజీ మంత్రి మల్లారెడ్డి భూములను కబ్జా చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.