కేంద్ర కేబినెట్ ఇటీవలే జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికల విధానాన్ని వ్యతిరేకించింది. ప్రతిపక్ష నేతలు చాలా వరకు ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
జమిలి ఎన్నికల విధానం భారతదేశంలో ప్రమాదకరం అన్నారు కమల్ హాసన్. దాని మచ్చలు కొన్ని దేశాల్లో చాలా వరకు ఉన్నాయి. భారతదేశానికి జమిలీ ఎన్నికల విధానం అవసరం లేదన్నారు. భవిష్యత్ లో కూడా దీని అవసరం ఉండదని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఏకకాలంలో ఎన్నికలు జరిగితే అది నియంతృత్వానికి, వాక్ స్వాతంత్య్రానికి, ఒకే నాయకుడి ఆధిపత్యానికి దారి తీస్తుందని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 2014 లేదా 2015 సమయంలో ఈ ఎన్నికలు జరిగితే ఒక పార్టీకే పూర్తి అధికారం దక్కేదని.. అది నియంతృత్వానికి దారి తీసేదన్నారు కమల్ హాసన్.