బెంగళూరుః దేశానికి అన్నం పెడుతూ వెన్నుకు దన్నుగా నిలుస్తున్న అన్నదాతలపై రాజకీయ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కొద్ది కాలంగా అధికమవుతున్నాయి. ఆ కోవలోనే కర్నాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ మైసూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతన్నలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకునే అన్నదాతలు మానసికంగా బలహీనులన్నారు. అలాగే, ఆ ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమంటూ.. సర్కారు మెడకు చుట్టడం సరైంది కాదంటూ వ్యాఖ్యానించారు.
అన్నదాతలకు ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు అసలు కారణం కానే కాదంటూ పేర్కొన్నారు. ఆత్మహత్యలు రైతులు మాత్రమే చేసుకోవడం లేదనీ, ఇతర రంగాలకు చెందిన వారు కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారనీ, వారిలో పారిశ్రామికవేత్తలు, అధికారులు, ఇతర కార్మికులు ఉన్నారని తెలిపారు. ఈ బలవన్మరణాలను తగ్గించడానికి ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు, కార్యక్రమాలు తీసుకురావడానికి కసరత్తులు చేస్తున్నదని వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక జిల్లా ఒక ఉత్పతి (ఓడీఓపీ) కార్యక్రమం సైతం అందులోని భాగమేనని పేర్కొన్నారు.