కర్ణాటక రాజకీయాల్లో లైంగిన దాడులు, వేధింపుల కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతణ్ని భారత్‌కు తీసుకొస్తామని ఆ రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
కర్ణాటక మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ బి.కె.సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని పరమేశ్వర తెలిపారు. దీంట్లో ఇద్దరు మహిళా ఎస్పీలు కూడా ఉన్నారని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. వీడియోలకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ విభాగానికి పంపుతారని.. మిగిలిన ఆధారాలను సేకరిస్తారని పేర్కొన్నారు. అధికారిక సమాచారం ప్రకారం ప్రధాన నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లారని.. సిట్ ఆయన్ను ఇక్కడకు తీసుకొస్తుందని అన్నారు..