బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు సాధారణమేనని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం కావడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయన దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ తాను చేసిన కామెంట్స్ పై యూటర్న్ తీసుకున్నారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు.
నా కామెంట్స్ ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా వ్యాఖ్యలను వక్రీకరించే అవకాశం మరికొందరికి ఇవ్వను. అందుకే నేను అన్న వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మహిళల భద్రతపై నిరంతరం ఆందోళన చెందే వారిలో నేనూ ఉంటాను. వారి క్షేమం కోసం నిర్భయ నిధులను ఉపయోగిస్తున్నాం. నా మాటల వల్ల మహిళలు బాధపడి ఉంటే నన్ను క్షమించండి. అంటూ తాజాగా హోంమంత్రి జి.పరమేశ్వర ఓ ప్రకటన విడుదల చేశారు. దెబ్బకు గురుడు దిగొచ్చాడు అంటూ ఈ ప్రకటన చూసి పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.