తల్లిదండ్రుల మధ్య కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు

-

పిల్లలకు పేరు పెట్టేటప్పుడు చాలా సార్లు తల్లిదండ్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరదు. తల్లి ఓ పేరు పెట్టాలనుకుంటే తండ్రి మరో పేరు పెట్టాలనుకుంటాడు. ఇలా ఇద్దరు రెండు పేర్లతో పిల్లల కోసం గొడవపడుతుంటారు. కానీ చివరకు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయి ఒక పేరును నిర్ణయించడమో.. లేక చెరో పేరుతో పిలుచుకోవాలని నిర్ణయించడమో జరుగుతుంది. కానీ ఓ జంట మాత్రం తమ పాపకు పేరు పెట్టడంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ విషయంలో గొడవ పడి చివరకు కోర్టు మెట్లు ఎక్కడంతో ఆ పాపకు హైకోర్టు పేరు పెట్టింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

2020 ఫిబ్రవరిలో ఓ జంటకు కుమార్తె పుట్టింది. అభిప్రాయ భేదాలతో దంపతులు వేర్వేరుగా ఉన్నా.. పాప మాత్రం తల్లి వద్దే ఉంటోంది. గతంలో చిన్నారికి జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంలో పేరు లేకపోవడం వల్ల.. ఓ పేరు నమోదు చేసేందుకు ఆమె తల్లి ప్రయత్నించారు. పేరు నమోదుకు కచ్చితంగా తల్లిదండ్రులిద్దరూ హాజరు కావాలని సంబంధిత అధికారి స్పష్టం చేశారు. దంపతులిద్దరూ ఆ చిన్నారికి వేర్వేరు పేర్లు సూచించారు. ఇద్దరూ పట్టు వీడకపోవడం వల్ల.. చిన్నారి తల్లి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. చిన్నారికి పేరు పెట్టి సమస్యను పరిష్కరించారు. తల్లి సూచించిన పేరుతోపాటు తండ్రి పేరునూ జత చేసి.. పాపకు ఓ పేరు ఖరారు చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news