నేటి కాలంలో పిల్లలు ఇంటి భోజనం కంటే కూడా బయటి ఫుడ్‌కు ఎక్కువ అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్‌కు బానిసలవుతున్నారు. దీనివల్ల చిన్నతనంలోనే ఊబకాయం బారిన పడుతూ అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా చిన్నారుల భోజనం, ఆరోగ్యం వంటి పలు అంశాలపై కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమ్మ చేతివంట ప్రాముఖ్యతను కేరళ హైకోర్టు అందరికీ గుర్తు చేసింది.
ఆన్‌లైను ద్వారా తిండి తెప్పించుకోవడం తగ్గించి, పిల్లలకు ఇంట్లో వండే ఆహారాన్ని అందించాలని కేరళ హైకోర్టు సూచించింది. రెస్టారెంట్ల నుంచి ఆన్‌లైను ద్వారా ఫుడ్ కొనటానికి బదులు, అమ్మ వండిన రుచికరమైన ఆహారాన్ని పిల్లలకు పెట్టాలని.. వారు ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలని చెప్పింది. బాగా ఆడుకొని ఇంటికి తిరిగిరాగానే తల్లి చేతివంట ఘుమఘుమలతో వారికి స్వాగతం పలకండి అంటూ కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.కున్హీకృష్ణన్ తల్లులకు సూచనలు చేశారు. మరోవైపు.. సరైన పర్యవేక్షణ లేకుండా మైనర్లకు మొబైల్ ఫోన్లు ఇవ్వటం వల్ల కలిగే ప్రమాదాల గురించి తల్లిదండ్రులను ఆయన హెచ్చరించారు. అశ్లీల చిత్రాల వీక్షణకు సంబంధించిన కేసు విచారణలో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.