జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ​లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

-

అన్ని పాల క్యాన్లపై జీఎస్టీని 12శాతంగా, కార్టన్‌ బాక్సులపై 18 శాతం నుంచి 12శాతానికి పన్నును తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితోపాటు  రైల్వే ప్లాట్‌ఫాం టికెట్లతోపాటు విద్యా సంస్థల బయట ఉండే ప్రైవేటు హాస్టళ్లను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు దిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. మరోవైపు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోని తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్రని, అవి రేటును నిర్ణయించాక అమల్లోకి తెస్తామని స్పష్టం చేసింది.

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..

  • రైల్వేల్లో ప్లాట్‌ఫాం టికెట్లు, విశ్రాంతి గదులు, వెయిటింగ్‌ హాళ్లు, సామానులు భద్రపరిచే గదులు, బ్యాటరీ వాహనాలు, రైల్వేశాఖలో అంతర్గత లావాదేవీలపై జీఎస్టీ మినహాయింపునకు ఆమోదం తెలిపింది.
  • రైల్వేల్లో ప్రత్యేక వాహక సంస్థలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
  • నెలకు రూ.20,000 కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేటు హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు.
  • మిల్క్‌ క్యాన్లపై (స్టీలు, ఇనుము, అల్యూమినియం) జీఎస్టీని 12శాతానికి మండలి పరిమితం చేసింది.
  • కార్టన్‌ బాక్సులపై 18 శాతం నుంచి 12శాతానికి పన్ను తగ్గింది.
  • సోలార్‌ కుక్కర్లు, స్ప్రింక్లర్లపై జీఎస్టీ ఇకపై 12 శాతమే.
  • విమానాల విడి భాగాలు, టెస్టింగ్‌ సామగ్రి దిగుమతిపై 5శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
  • కోళ్ల ఫారాల యంత్రాలపై 12శాతం జీఎస్టీ ఉంటుంది.
  • రక్షణ, పరిశోధనలకు సంబంధించిన వాటి దిగుమతులపై 2029 వరకూ జీఎస్టీ మినహాయింపు.

Read more RELATED
Recommended to you

Latest news