కేరళ, తమిళనాడులో లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది. ఐయూఎంఎల్ ప్రధాన కార్యదర్శి సలామ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో ఏప్రిల్ 19న, కేరళలో ఏప్రిల్ 26న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేశారు. ఈ రెండు తేదీలు శుక్రవారం వస్తున్నాయని, ఆరోజు ముస్లింలకు ముఖ్యమైన రోజు కాబట్టి ముస్లిం అధికారులకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందన్నారు. అందుకే రెండు తేదీలను మార్చాలని తెలిపారు.
ఈ విషయాన్ని భారత ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. శుక్రవారం పోలింగ్ నిర్వహించడం వల్ల ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల విధులకు ఆటంకం కలుగుతుందని వెల్లడించారు. మరోవైపు ఇతర ముస్లిం సంస్థలు కూడా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీని మార్చాలని ఈసీని ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ పార్టీకి ఐయూఎంల్ ప్రధాన మిత్ర పక్షంగా ఉంది. పార్లమెంటు ఎన్నికల రెండో విడతలో భాగంగా కేరళలోని 20లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దళలోనే ఎలక్షన్ నిర్వహించనున్నారు.