సార్వత్రిక సమరంలో మూడో దశ పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. మూడో విడతలో భాగంగా ఈరోజు (మే 7వ తేదీ 2024) 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మూడో విడతలో వాస్తవానికి 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా, సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ – అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో ఆరో విడతకు పోలింగ్ తేదీని మార్చారు. ఫలితంగా మూడో విడతలో 93 సీట్లకే పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1,300 మందికిపైగా అభ్యర్థులు ఈ దశలో పోటీ పడుతుండగా.. వారిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు.
కేంద్రమంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తమ్ రూపాలా, ప్రహ్లాద్ జోషి, ఎస్.పి.సింగ్ బఘెల్ కూడా తృతీయ విడత బరిలో నిలిచారు. గుజరాత్, కర్ణాటక, బిహార్, మధ్యప్రదేశ్‌ల్లో ఈరోజు పోలింగ్ జరగనుంది. గాంధీనగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని అహ్మదాబాద్ నగరంలో మోదీ, అమిత్ షా మంగళవారం ఓటు వేయనున్నారు.