దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగాయి. ఎల్పీజీ సిలిండర్‌పై రూ.50 పెరిగింది. ఉజ్వల పథకం సిలిండర్లపైనా రూ.50 పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు రేపటి (ఏప్రిల్ 8వ తేదీ 2025 మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపాయి. వంటగ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇది సామాన్యులపై మరింత భారం వేసినట్టేనని మధ్యతరగతి ప్రజలు అంటున్నారు.
మరోవైపు వాహనదారులకు కేంద్ర షాక్ ఇచ్చింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్సైజ్ డ్యూటీ పెరుగుదల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో పెరుగుదల ఉండదని చమురు మార్కెటింగ్ కంపెనీలు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినందున ఈ అదనపు భారాన్ని చమురు సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని సమాచారం.