నకిలీ డాక్టర్ నిర్వాకం వల్ల 30 రోజుల్లో ఏడుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అతడి వద్ద గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులు వారం వ్యవధిలో మరణించారు. ఈ మేరకు ఫిర్యాదులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని అదుపులోకి దర్యాప్తు చేస్తున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
దమోహ్ పట్టణంలో ప్రైవేట్ మిషనరీ ఆస్పత్రిలో గుండె నిపుణుడిగా విధులు నిర్వహిస్తున్న ఎన్ జాన్ కెమ్ అనే వ్యక్తి వద్ద శస్త్రచికిత్స చేయించుకున్న ఏడుగురు రోగులు వారం వ్యవధిలో మరణించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేయగా.. అతడు అసలు వైద్యుడే కాదని గుర్తించినట్లు తెలిపారు. ఎన్ జాన్ కెమ్ అనే ఓ ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడి పేరు వాడుకొని అతడు కార్డియాలజిస్టుగా చలామణి అవుతున్నట్లు చెప్పారు. నిందితుడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని వెల్లడించారు. అతడు చేసిన ఆపరేషన్లకు ఆస్పత్రికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం నుంచి డబ్బు కూడా అందుతున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.