తమిళనాడు మంత్రి పొన్ముడి ఇటీవల చెన్నైలోని ఓ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను మద్రాస్ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంలో వెంటనే మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. లేని పక్షంలో అది కోర్టు ధిక్కార చర్యగా పరిగణిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వ్యవహారాన్ని కోర్టు తీవ్రంగా పరిగణిస్తోందని.. దీనిపై ఫిర్యాదు లేకపోయినా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయండని జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేశ్ పోలీసులను ఆదేశించారు.
ఇక ఇటీవల చెన్నైలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సెక్స్ వర్కర్, కస్టమర్ మధ్య సంభాషణ ఇలా ఉందంటూ.. అసభ్యకర పదజాలాన్ని ఉపయోగిస్తూ మంత్రి పొన్ముడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో మంత్రి మాట్లాడిన తీరు మహిళలను కించపర్చేలా ఉందంటూ నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తి పోశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, గాయని చిన్మయి, నటి ఖుష్బూతోపాటు పలువురు ప్రముఖులు ఆయన తీరును ఖండించగా.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆయన్ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు.