నాందేడ్‌ ఆసుపత్రిలో మరో ఏడుగురు రోగులు మృతి

ఔషధాలు, సిబ్బంది కొరత వల్ల మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణమృదంగం మోగుతోంది. ఇప్పటికే సోమవారం రోజున 24 గంటల వ్యవధిలో 12 మంది శిశువులు సహా 24 మంది రోగులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇక అర్ధరాత్రి సమయంలో మరో ఏడుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. గడిచిన 48 గంటల్లో ఈ ఆస్పత్రిలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ మరణాలపై విచారణకు మహారాష్ట్ర సర్కార్ ఆదేశించింది. ఇందుకోసం ఓ త్రిసభ్య కమిటీని నియమించింది. ఇవాళ మధ్యాహ్నం ఈ కమిటీ తమ నివేదికను సర్కార్​కు సమర్పించనుంది. మరోవైపు ఈ మరణాలు మహారాష్ట్ర ప్రభుత్వం వల్లే సంభవించాయని విపక్షాలు మండిపడుతున్నాయి. ఆస్పత్రిలో మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు రోగుల్లో కొందరు పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి డీన్‌ శంకర్‌రావు చవాన్‌ తెలిపారు. పలువురు సిబ్బందిని బదిలీ చేయడంతో రోగులకు సేవలందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. మందుల కొరతతో రోగులు మరణించినట్లు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.