నందిగ్రామ్‌ ఫలితంపై విచారణ.. దీదీకి రూ. 5 లక్షల జరిమానా

-

పశ్చిమబెంగాల్‌లో సంచలనం రేపిన నందిగ్రామ్(Nandigram‌) ఎన్నిక ఫలితంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిటిషన్‌ వేసిన విషయం తెల్సిందే. అయితే పిటిషన్‌ విషయంలో నేడు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మమతా బెనర్జీ పిటిషన్‌ విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌశిక్‌ చందా ప్రకటించారు. అలానే న్యాయవ్యవస్థ, న్యాయమూర్తిని కించపరినందుకు పిటిషనర్ అయిన మమతా బెనర్జీకి రూ. 5లక్షల జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు.

నందిగ్రామ్ /Nandigram‌

ఇటీవలే జరిగిన బెంగాల్‌ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. ఫలితాల ప్రకటన సమయంలో కూడా గందరగోళం నెలకొంది. అయితే నందిగ్రామ్‌ ఎన్నిక ఫలితం ప్రకటనలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ సువేందు అధికారి ఎన్నికను సవాల్‌ చేస్తూ మమతా బెనర్జీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ విచారణను కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌశిక్‌ చందాకు కాకుండా మరో ధర్మాసనం ముందుకు మార్చవలసిందిగా దీదీ గత నెలలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కార్యదర్శికి లేఖ రాశారు. బీజేపీ నేపథ్యం ఉన్న కౌశిక్‌ చందా పిటిషన్‌ విచారిస్తే తమకు న్యాయం జరగదని దీదీ లేఖలో పేర్కొన్నారు.

మమతా బెనర్జీ అభ్యర్థనపై జస్టిస్‌ కౌశిక్‌ చందా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసులో విచారణ జరపాలని ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం తనకు లేదని, ఆసక్తి అంతకన్నా లేదని అన్నారు. కేసు విచారణ నుంచి స్వయంగా తప్పుకున్నట్లు ప్రకటించి విచారణను హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ రాజేశ్ బిందాల్‌కు పంపారు. ఇక జూన్‌ 18న తను ఈ కేసులో విచారణ చేపట్టిన తర్వాత టీఎంసీ నేతలు తన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారని కౌశిక్‌ చందా ఆగ్రహానికి గురయ్యారు.ఇది పూర్తిగా న్యాయమూర్తిని అవమానించేందుకు చేసిన ముందస్తు ప్రణాళిక అని మండిపడ్డారు. న్యాయవ్యవస్థను కించపరిచినందుకుగానూ మమతా బెనర్జీకి రూ. 5లక్షల జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. కాగా జస్టిస్‌ కౌశిక్‌ చందా కోల్‌కతా హైకోర్టు బెంచ్‌కు రాకముందు బీజేపీ ప్రభుత్వానికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version