కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి గట్టి పోటీని ఇస్తున్నవారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదటి స్థానంలో ఉంటారు. మొన్న జరిగిన ఎన్నికలే ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తాయి. ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు ఎనిమిది సార్లు ప్రచారానికి మోడీ, అమిత్ షాలు రావడంతోనే ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. బీజేపీ ఎంత ప్రయత్నించినా కూడా బెంగాల్ లో కాషాయం జెండా ఎగరలేదు. ముచ్చటగా మూడవ సారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని మమతా బెనర్జీ దక్కించుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి మామిడి పండ్లను బహుమతిగా పంపారు. పశ్చిమ బెంగాల్ లో అధికారంలో వచ్చినప్పటి నుండి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్న దీదీ, ఈ సారి కూడా మామిడి పండ్లని పంపారు. మొత్తం 5రకాల పండ్లను ప్రధాని కార్యాలయానికి అందించింది. ఇంకా దీదీ మామిడి పండ్లని పంపిన వారి లిస్టులో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉన్నారు.