మహారాష్ట్రలోని బల్లార్ష – కార్వా అటవీ ప్రాంతంలో టి-86 అనే పెద్దపులి నాలుగు నెలల కాలంలో నలుగురు వ్యక్తుల ప్రాణాలు తీసింది. అప్పటి నుంచి ఈ పులి కోసం అటవీ శాఖ అధికారులు రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా గాలిస్తున్నారు. దీనికోసం పలు ప్రాంతాల్లో ట్రాప్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎట్టకేలకు ఈ పెద్దపులిని అటవీ అధికారులు సోమవారం రాత్రి పట్టుకుని చంద్రపూర్‌కు తరలించారు.
అటవీ సమీప గ్రామాల్లోని ముగ్గురు పురుషులు, ఓ మహిళను, పశువులను పెద్దపులి హతమార్చిందని అటవీ అధికారి నరేశ్ బావరే తెలిపారు. పులిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలు, బోన్లు అమర్చి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పులి కార్వా అడవిలో సంచరిస్తోందని గుర్తించామని పేర్కొన్నారు. వెంటనే షూటర్ అవినాష్ ఫూల్‌జలేను రంగంలోకి దింపి మత్తు సూది ఇచ్చామని చెప్పారు. అటవీ శాఖ వైద్యాధికారి కుందన్ ఆధ్వర్యంలో పులిని బోనులో బంధించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నట్లు నరేశ్ బావరే వివరించారు.