జాతుల మధ్య వైరంతో రాజుకుంటున్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారలేదు. అక్కడ హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బిష్ణుపుర్ జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారు క్వాక్టా ప్రాంతంలోని మైతేయి వర్గానికి చెందిన వారని తెలుస్తోంది.
శుక్రవారం అర్ధరాత్రి వీరు తమ ఇళ్లకు కాపాలా కాస్తుండగా గుర్తుతెలియని దుండగులు వీరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో తండ్రీకుమారుడితో పాటు మరో వ్యక్తి మరణించారని చెప్పారు. నిందితులను మిలిటెంట్లుగా అనుమానిస్తున్నారు. కేంద్ర భద్రతా దళాల బఫర్‌జోన్‌ను దాటుకుని దుండగులు గ్రామంలోకి చొరబడి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనతో క్వాక్టాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఈ ప్రాంతంలో కుకీ వర్గానికి చెందిన ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో భీకర కాల్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.