టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ(54) కారు ప్రమాదంపై మెర్సిడెజ్ బెంజ్ కీలక నివేదిక రూపొందించింది. ఈ నివేదికను మహారాష్ట్ర పాల్ఘర్ పోలీసులకు అందజేసింది. మిస్త్రీ కారు ప్రమాదానికి ముందు పరిస్థితులను మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ ఈ నివేదికలో వివరించింది. కారులోని ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్‌ను విశ్లేషించి ఈ విషయాలు తెలుసుకున్నట్లు తెలిపింది.
ప్రమాదానికి గురైన కారు.. ప్రస్తుతం ఠాణే హీరానందనిలో తమ షోరూమ్‌లో ఉన్నట్లు మెర్సిడెజ్ బెంజ్ ప్రతినిధులు తెలిపారు. అందులోని ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్(ఈసీఎం)ను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు వివరించారు. దర్యాప్తులో పోలీసులు, సంబంధిత అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
బెంజ్ కంపెనీ ఇచ్చిన నివేదికలోని కీలకాంశాలు ఇలా ఉన్నాయి..
- ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
- డివైడర్‌ను ఢీకొట్టడానికి కచ్చితంగా ఐదు సెకన్ల ముందు బ్రేకులు వేశారు.
- సూర్యా నది వంతెనపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టే సమయంలో కారు వేగం గంటకు 89 కిలోమీటర్లు.
- క్రాష్ జరిగిన వెంటనే కారులోని నాలుగు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి. ఇందులో మూడు డ్రైవర్ సీట్ వద్ద ఉండగా, మరొకటి పక్కన ఉంది.