భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్తోపాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ క్రమంలో వీరితో కాసేపు ముచ్చటించారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే నాలుగు శక్తులుగా వ్యోమగాములను మోదీ అభివర్ణించారు.
కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో గగన్యాన్ ప్రాజెక్టు పురోగతిని ప్రధాని పరిశీలించారు. చంద్రయాన్, గగన్యాన్ వంటి ప్రాజెక్టుల్లో మహిళల పాత్ర ఎనలేనిదని మోదీ కొనియాడారు. గగన్యాన్ మిషన్లో చాలా వరకు భారత్లో తయారైన పరికరాలను ఉపయోగించడం గర్వకారణమని అన్నారు. దేశాభివృద్ధి ప్రయాణంలో కొన్ని ఘట్టాలు భవిష్యత్ను నిర్దేశించేవిగా ఉంటాయని ఇది అలాంటి క్షణమేనని పేర్కొన్నారు. 40 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు స్పేస్లో అడుగుపెట్టనున్నారని తెలిపారు.