ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందని, దేశ ప్రజల్లో వికసిత్ భారత్ స్ఫూర్తి రగిలిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ స్ఫూర్తిని కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని పిలు పునిచ్చారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రతి ప్రాంతం ఎంతో ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని తెలిపారు. దేశ ప్రజల్లో వికాస, స్వయం సమృద్ధి భారత్ స్ఫూర్తి రగిలిందని చెప్పారు. 2024లోనూ దాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ దేశ ప్రజలందిరికి మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఏడాది భారత్ సాధించిన విజయాలు గుర్తు చేశారు. ఆ గుర్తులు ఏంటంటే..?
సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు ఈ సంవత్సరంలోనే ఆమోదం లభించడం.
భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం
ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం.
ఈ ఏడాది ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం
‘ఎలిఫెంట్ విస్పరర్స్’కు సైతం ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు రావటం
ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలతో సత్తా చాటడం
వన్డే ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు గెలుచుకోవడం
చంద్రయాన్-3 విజయవంతం కావడం