గూఢచర్య ఆరోపణలతో అరెస్ట్ చేసిన 8 మంది భారత మాజీ నౌకాదళ అధికారులను విడుదల చేసిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఖతర్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 14వ తేదీన ప్రధాని ఖతార్‌కు వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 13, 14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించనున్న మోదీ అక్కడి నుంచి ఖతార్ రాజధాని దోహాకు వెళ్తారని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు.
మాజీ అధికారుల విడుదల వ్యవహారాన్ని ప్రధాని మోదీ వ్యక్తిగతంగా పర్యవేక్షించారని వినయ్ మోహన్ తెలిపారు. ఇది ఆయన నాయకత్వానికి నిదర్శమని అన్నారు. ఖతార్ పర్యటనలో భాగంగా ఎమిర్ షేక్ తమీమ్‌బిన్ హమద్ అల్ థానీ సహా ఇతర ఉన్నతాధికారులతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. యూఏఈ పర్యటనలో మోదీ అబుదాబిలో… బీఏపీఎస్ స్వామి నారాయణ సంస్థాన్ నిర్మించిన హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.
“యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. దుబాయ్‌లో జరిగే ప్రపంచ ప్రభుత్వ సదస్సు-2024కు గౌరవ అతిథిగా హాజరవుతారు. యూఏఈలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీలో అక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అని వినయ్ మోహన్ క్వాత్రా పేర్కొన్నారు.