కేరళలోని వయనాడ్ ప్రకృతి ప్రకోపానికి బలైంది. కొండచర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 300కుపైగా మంది మరణించారు. ఈ ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ కోసం గత తొమ్మిదోరోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 138 మంది ఆచూకీ తెలియలేదు. ఆ ప్రాంతంలో ప్రజల రేషన్‌కార్డులు, ఓటరు కార్డుల ఆధారంగా కేరళలోని వయనాడ్ జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా తేల్చింది. దీనికంటే ముందు క్షేత్ర స్థాయిలో వివిధ విభాగాల నుంచి సేకరించిన వివరాలతో క్రోడీకరించి ఈ అంచనాకు వచ్చింది.
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, మరణించినట్లు తేలినవారు, పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నవారి వివరాలను తొలగిస్తే 138 మంది ఏమయ్యారో తెలియడం లేదని అధికార యంత్రాంగం తెలిపింది. వీరి వివరాలను వయనాడ్ జిల్లా అధికారిక వెబ్‌సైట్లో, కలెక్టర్ సామాజిక మాధ్యమ ఖాతాల్లో, నోటీసు బోర్డుల్లో పెట్టినట్లు చెప్పింది. మరోవైపు వయనాడ్ బాధితులకు అండగా పలువురు ప్రముఖులు నిలుస్తున్నారు. ఇప్పటికే గౌతమ్ అదానీ వంటి వ్యాపారవేత్తలు, చిరంజీవి, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి సినీ హీరోలు భారీగా విరాళాలు ప్రకటించారు.