దిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు దిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు పాఠశాలలు మూసివేయాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) దిల్లీ ప్రభుత్వానికి సూచించింది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాయు నాణ్యత మెరుగయ్యే వరకు పాఠశాలలు మూసివేసే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
దిల్లీలో వాయు కాలుష్యానికి తగ్గించేందుకు అత్యవసర ప్లాన్‌ను సిద్ధం చేయాలని NCPCR కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ డేటా ప్రకారం.. నవంబరు 2న దిల్లీలో ‘వెరీ పూర్’ కేటగిరిలో నమోదైంది. ఇవాళ కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.