వివాహం జరిగిన ఆ ఇంట్లో అదే రోజున రెండు చావులు విషాదం నింపాయి. అది కూడా వివాహ బంధంతో ఒక్కటైన జంట చనిపోవడంతో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై కనీసం రోజు కూడా గడవకముందే ఆ జంట అనంత లోకాలకు వెళ్లింది. ఈ విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే.. యూపీకి చెందిన 22 ఏళ్ల ప్రతాప్ యాదవ్‌కు 20 ఏళ్ల పుష్పతో వివాహం జరిగింది. వివాహ తంతు పూర్తయిన తర్వాత వాళ్లిద్దరూ పడక గదికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం వారిని నిద్ర లేపేందుకు ఆ కుటుంబం గది తలుపులు కొట్టగా ఎంతకీ వాళ్లు తలుపులు తెరవలేదు. ఏమైందోనని ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూసే సరికి ఇద్దరూ మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, నూతన దంపతుల మృతికి గుండెపోటు కారణమని పోస్టుమార్టంలో తేలినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. వారిద్దరికీ ఒకే చోట దహన సంస్కారాలు నిర్వహించారు. మే 30న జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.