కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఏర్పాటైన ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా చోటు దక్కించుకున్న వారు పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. మంగళవారం రోజున కొందరు ప్రమాణ స్వీకారం చేయగా.. ఇవాళ మరికొందరు పదవీ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా రెండోసారి నియమితులైన నిర్మలా సీతారామన్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు.
నార్త్ బ్లాక్‌కు చేరుకున్న ఆమెకు…ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను వచ్చేనెల సమర్పించే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. గతంలో చేపట్టిన శాఖనే మళ్లీ అప్పగించినందుకు…ప్రధాని మోదీకి ఆయన ఎక్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. దూరదృష్టి కలిగిన మోదీ నాయకత్వంలో…దేశంలో అంతర్జాతీయ స్థాయి…ఆధునిక మౌలిక సదుపాయాలు వేగవంతంగా అందుబాటులోకిరానున్నాయని గడ్కరీ పేర్కొన్నారు.