పార్లమెంట్ ఎన్నికల 2024 సందర్భంగా అన్ని పార్టీలు పోటీకి సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమతమ పార్టీల్లో మార్పులు చేర్పులు, కార్యాచరణ, వ్యూహాలు, చేరికలపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తమకు పట్టున్న రాష్ట్రాల్లో క్రితం కంటే ఎక్కువ సీట్లు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.
మరోవైపు బిహార్లోని జేడీయూలో లోక్సభ ఎన్నికల ముందు పెనుమార్పు చోటుచేసుకుంది. జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఎన్నికయ్యారు. శుక్రవారం దిల్లీలో జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఇందుకు వేదికైంది. ఇప్పటివరకు జేడీయూ అధ్యక్షుడిగా ఉన్న లలన్ సింగ్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తదుపరి సారథిగా జాతీయ కార్యవర్గ సమావేశంలో నీతీశ్ కుమార్ పేరును ప్రతిపాదించగా కార్యవర్గంలోని సభ్యులు ఇందుకు అనుకూలంగా ఓటేశారు. ఈ క్రమంలో పార్టీ పగ్గాలు నీతీశ్ కుమార్ చేతికి వచ్చాయి. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇవాళ సాయంత్రం ఆ పార్టీ ప్రకటన జారీ చేయనుంది.