కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎమ్ఓ) నుంచి కొందరు సీనియర్ జర్నలిస్టులకు దీపావళి స్వీట్ బాక్స్ లతో పాటు నగదు బహుమతులను అందజేసింది అన్న ఆరోపణలపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ శనివారం డిమాండ్ చేసింది. కొందరు జర్నలిస్టులకు లక్షల నగదును ముడుపుగా ముట్టజెప్పిందని.. ఇది ముఖ్యమంత్రి ఇచ్చిన ముడుపు కాదా? అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా ప్రశ్నించారు.
అయితే ఈ ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఈ వార్తలన్నీ అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు. ఇదంతా కాంగ్రెస్ సృష్టించిన బూటకముని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎవరికి ఎలాంటి కానుకలు ఇచ్చారో తనకు తెలుసు అని అన్నారు. కాగా తమకు సీఎం సన్నిహితుల నుంచి అందిన గిఫ్ట్ లను తిరిగి ఇచ్చేశామని పలువురు జర్నలిస్టులు చెప్పిన విషయం తెలిసిందే. కొందరు ఈ విషయంపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారని.. దర్యాప్తులో నిజాలు తెలుస్తాయి అన్నారు.