భారత్లో అంతరించి పోతున్న వన్యప్రాణి జాతిని పునఃప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో కేంద్ర సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రాజెక్టు చీతాను చేపట్టింది. ఇందులో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు విడతల్లో 20 చీతాలను దేశానికి తీసుకొచ్చింది. వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టగా పలు కారణాలతో ఇప్పటికే తొమ్మిది చీతాలు మరణించాయి. ఇక తాజాగా కునో పార్కులో మరో చీతా మృతి చెందింది.
నమీబియా నుంచి తెచ్చిన చీతాల్లో ఒకటైన శౌర్య మంగళవారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం చీతా తూలుతూ నడవడాన్ని గుర్తించిన ట్రాకింగ్ బృందం బలహీనంగా ఉన్న ఆ చీతాకు వెంటనే చికిత్స అందించగా మొదట అది కాస్త కోలుకున్నట్లే కన్పించింది. కానీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చీతా మృత్యువాత పడినట్లు అధికారులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం తర్వాతే మృతికి గల కారణాలపై స్పష్టత వస్తుందని వెల్లడించారు.
భారత్కు తీసుకువచ్చిన 20 చీతాల్లో ఆరు చీతాలు పలు కారణాలతో చనిపోయాగా.. గతేడాది మార్చిలో జ్వాల అనే మరో నమీబియా చీతాకు నాలుగు కూనలు పుట్టగా, అనారోగ్య కారణాలతో అందులో మూడు మృతి చెందాయి. తాజా మరణంతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన చీతాల సంఖ్య 10కి చేరినట్లు అధికారులు ధ్రువీకరించారు.