కేంద్ర ప్రభుత్వం దేశంలో ఒకే నాయకుడు ఉండాలని కోరుకుంటుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ వయనాడ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘భారతదేశం ఓ పూలగుత్తి వంటిది. అందులోని ప్రతీఒక్క పూవు గొప్పదనాన్ని గౌరవించాలి. ఎందుకంటే అవే ఆ గుత్తికి అందం తెస్తాయి. అలాగే దేశంలోని ప్రతీ పౌరుడు నాయకుడిగా ఎదగాలి. అలాకాకుండా దేశానికి ఒకే నాయకుడు ఉండాలంటే అది దేశ యువతను అవమానించినట్లు అవుతుంది’ అని ఆయన అన్నారు.
భారతదేశంలో ఎక్కువ మంది యువత నాయకులుగా ఎదగకపోవడానికి బీజేపీ ఆలోచనా విధానమే కారణమని దుయ్యబట్టారు. కానీ కాంగ్రెస్ అందుకు వ్యతిరేకంగా దేశ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను, విశ్వాసాలను, సలహాలను గౌరవిస్తుందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశం బ్రిటిషు వారి నుంచి స్వాతంత్య్రాన్ని పొందలేదని వ్యాఖ్యానించారు. దేశాన్ని పాలించే అవకాశం భారత పౌరులందరికీ రావాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు రాహుల్ గాంధీ.