రాజ్యసభ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ విషయంపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రతిపక్షాలు మాత్రమే బాధ పడుతున్నట్లుగా వారు భావిస్తున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. దేశం మొత్తం వినేశ్ ఫొగాట్ గురించి బాధపడుతున్నారని అన్నారు. దాన్ని రాజకీయం చేస్తే అది ఆమెను అవమానించినట్లే అవుతుందని తెలిపారు. ఆమె చేయాల్సిన ప్రయాణం ఇంకా ఎంతో ఉందని వెల్లడించారు.
ఇక పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్ వరకు చేరిన వినేశ్ ఫొగాట్ 100 గ్రాముల అధిక బరువు ఉండటంతో అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. భారత్కు మెడల్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందని ఆమెతో పాటు యావత్ భారతావని ధుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ దుఃఖం నుంచి తేరుకోక ముందే వినేశ్ .. రెజ్లింగ్ నుంచి నిష్క్రమిస్తూ రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె నిర్ణయంతో యావత్ భారత్ షాక్కు గురైంది.