మణిపుర్‌లో ఇటీవల ఇద్దరు మహిళలపై వెలుగుచూసిన ఓ అమానుష ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ గొంతెత్తి వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అయితే ఈ అంశంపై చర్చ గురించి పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ఈ విషయంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రతిపక్షాలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం పార్లమెంటు ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు సమాచారం. ‘ఇండియా’ పేరుతో కొత్తగా ఏర్పాటయిన విపక్ష కూటమిలోని నేతలు తొలుత రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమై.. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంతరం ఉదయం 10 గంటల సమయంలో పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపి, ఆ తర్వాత సభకు హాజరుకానున్నట్లు వెల్లడించాయి.