తమిళనాడు కళ్లకురిచ్చి కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 47మంది మరణించారు. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో 109 మంది చికిత్స పొందుతున్నారు. కల్తీసారా ప్రభావంతో కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలం అవుతుండటం వల్ల నిపుణులైన వైద్యులను రంగంలోకి దింపి.. విళుపురం, సేలం తిరుచ్చి, తిరువణ్ణామలై జిల్లాల్లోని వైద్య కళాశాలల వైద్యులను తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు కళ్లకురిచ్చి ఘటనపై రాష్ట్రంలో విపక్షాలు భగ్గుమంటున్నాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో నిరనసకు దిగారు. నిరసనకారులను అక్కడి నుంచి పంపే క్రమంలో పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ స్టాలిన్ సీఎం పదవి నుంచి వైదొలగాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసింది. మరోవైపు జూన్ 24వ తేదీన ఈ ఘటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామి ప్రకటించారు.