బిల్లు ఆమోదం పొందాకే కంటోన్మెంట్‌ ఎన్నికలు!

-

పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాకే కంటోన్మెంట్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడుంటాయి? స్థానిక సంస్థల్లో విలీనం ఉంటుందా? కంటోన్మెంట్‌ చట్టంలో మార్పులేమైనా వస్తాయా? అన్న అంశాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం పార్లమెంటు సమావేశాల్లో ఎంపీ కృపాల్‌ బాలాజీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు.

కంటోన్మెంట్‌ చట్టం-2006ను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఈ బిల్లుకు తుదిరూపం ఇచ్చే పనిలో నిమగ్నమైనట్టు తెలిపారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాతే ఎన్నికలుంటాయని సంకేతాలిచ్చారు. మరింత ప్రజాస్వామికంగా బిల్లును రూపొందిస్తున్నామని, అభిప్రాయ సేకరణ పూర్తయినట్లు చెప్పారు.

ఉపాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడంతోపాటు.. ఆర్థిక అంశాల విషయంలో అధికారాన్ని ఉపాధ్యక్షుడి చేతిలో పెట్టడం, ప్రజాసంక్షేమ కమిటీల నియామకం వంటి కీలకాంశాలు ఈ బిల్లులో ఉన్నాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో కంటోన్మెంట్ల విలీన విషయమూ పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించినట్టు పేర్కొన్నారు.

దీనిపై కంటోన్మెంట్‌ వికాస్‌ మంచ్‌ హర్షం వ్యక్తం చేసింది. రక్షణమంత్రి సమాధాన ప్రతులతో వికాస్‌మంచ్‌ అధ్యక్షులు గడ్డం ఏబుల్‌, ప్రధానకార్యదర్శి సంకి రవీందర్‌తో పాటు పలువురు ప్రతినిధులు ఉత్సవాలు చేసుకున్నారు. మున్సిపాలిటీల్లో విలీన విషయంలో మంచ్‌ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version